30, సెప్టెంబర్ 2014, మంగళవారం

నాభాగుడు

నాభాగుడు నభగుని పుత్రుడు. సూర్య వంశమునకు చెందినవాడు.
ఇతను మెతకగా ఉండుట చూసి, ఆ అవకాశమును వినియోగించుకుంటూ అతని సోదరులు అతనికి ధనమును ఇవ్వకుండా ఉండిరి. తనకు తన భాగమును ఇప్పించ వలసినదిగా అన్నలను కోరగా, అప్పుడు అన్నలు తమ తండ్రి అయిన నభగుడు చెప్పినట్లయితే అతనికి అతని వాటా ఇస్తాం అని చెప్పారు. అప్పుడు నాభాగుడు తండ్రివద్దకు వెళ్లి, ఈ వృత్తాంతం చెప్పి, ఏమి చేయవలసినది అని తండ్రిని అడిగాడు.
అప్పుడు నభగుడు,  ఆ సమయంలోఅత్యంత జ్ఞానులయిన అంగిరసులు సత్రయాగం చేస్తూ ఉన్నారని, ఆ యాగంలో వారికి ఆ యాగం చేసే 6వ రోజున విస్వేదేవతలకు చేసే సూక్తులు జ్ఞాపకమునకు రావు కనుక నాభాగుని అక్కడ వెళ్లి వారికి ఆ సూక్తులను గుర్తు చేయమని చెప్పాడు. అలా గుర్తు చేసినందువలన బ్రహ్మజ్ఞాని అని లోకం నాభాగుని కీర్తిస్తుంది అని,అలా చేయుట వలన ఆ యాగం చివర మిగిలిన ధనమును నాభాగునకు ఇస్తారు అని కూడా చెప్పి నాభాగుడిని అక్కడకు పంపించాడు.
నాభాగుడు తండ్రికి నమస్కరించి ఆ యాగామునకు వెళ్లి తన తండ్రి చెపిన విధంగా అంగిరసులకు వారు మరచిపోయిన సూక్తులను గుర్తు చేసాడు.అప్పుడు  ఆ అంగిరసులు ఆ యాగంలో మిగిలిన ధనమును అతనికి ఇచ్చాం అని చెప్పి వారు స్వర్గమునకు వెళ్ళిపోయారు. అతనికి అలా లభించిన ఆ ధనమును తీసుకొనుటకు నాభాగుడు వెళుతుండగా, ఒక నల్లని సుందరమైన ఆకారం కలిగిన ఒక యువకుడు ఆ ధనమును తన  చేసుకొనెను.
అప్పుడు నాభాగుడు తనకు అంగిరసులు ఆ ధనమును ఇచ్చినారు కనుక ఆ ధనమును తిరిగి ఇవ్వమని అడిగాడు. అప్పుడు అతను ఒకవేళ నీ తండ్రి అయిన నభగుడు ఈ ధనమును నీకు ఇవ్వమని చెప్పినట్లయితే ఇస్తాను కనుక నీవు వెళ్లి నీ తండ్రిని అడిగిరా! అని చెప్పి పంపెను.
నాభాగుడు నభగుని వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పగా, నభగుడు జరిగిన విషయమును తన మనోనేత్రంతో చూసి ఆ యాగం చేసిన బ్రాహ్మణులు ఆ యాగంలో మిగిలిన భాగమును మహాదేవుడయిన శివునకు ఇస్తాం అని సంకల్పించారు కనుక ఆ భాగం శివునకు మాత్రమే చెందుతుంది అని తీర్పు చెప్పి నాబాగుని పంపించాడు.
తిరిగి వచ్చిన నాభాగుడు తన తండ్రి చెప్పిన విషయమును యధాతధంగా చెప్పి, ఆ భాగం మీద తనకు ఏవిధమైన హక్కులేదని చెప్పాడు.
నాభాగుని సత్య సంధతకు సంతోషించిన శివుడు ఆ యజ్ఞ భాగమును నాభాగునకు ఇచ్చి, అతనికి సనాతనమైన బ్రహ్మజ్ఞానమును ఉపదేశించి  వెనుతిరిగి వెళ్ళాడు. కాలాంతరంలో నాబాగునకు అంబరీషుడు జన్మించాడు.
వ్యాసమహర్షి నాబాగుని ఈ చరిత్రకు ఫలశృతి కూడా చెప్పారు.
ఎవరైతే శ్రద్దగా ఈ నాభాగుని వృత్తాంతం ప్రతిరోజూ చదువుతారో/ వింటారో/ పారాయణం చేస్తారో వారు జ్ఞానమును పొందుతారు, మరణానంతరం ముక్తిని పొందుతారు.

నా ఆలోచన:
మన పూర్వులు ఇటువంటి కధలను చాలా చెప్పారు. కొన్ని కధలకు ఫలశృతి కూడా చెప్పారు. అయితే  ఆ ఫల శృతి  ఆ కధను మరలా మరలా చదివేలా చేయాలి అని చెప్పి ఉన్నారు. అలా ఎందుకు? మరి ఈ కధకు ఈ ఫలశృతి ఎందుకు చెప్పారు?

  1. నాభాగుడు తన సోదరులు తన సొమ్మును బలవంతముగా తీసుకున్నపుడు ఏమి ఎదురు చెప్పలేదు, పైగా వెళ్లి వారిని మెల్లిగా అడిగాడు. మనం సహజంగా మన సంపదను ఎవరైనా తీసుకున్తరేమో అనే అనుమానం వస్తేనే వారి మీద గొడవకు దిగుతాం. 
  2. నాభాగుని అతని సోదరులు తండ్రిని అడిగి రమ్మనగానే, తన ఆస్తి మీరు తీసుకుని నన్ను తండ్రిని అడుగమంటారేమిటి అని విసుగును ప్రదర్శించలేదు. 
  3. తీరా తండ్రి వద్దకు వెళ్లి అడిగితే  అన్నలకు చెప్పి నీ ఆస్తి నీకు ఇప్పిస్తాను అని చెప్పకుండా, యాగమునకు వెళ్లి దానం తేసుకో అని చెప్పాడు. మరి ఒక తండ్రిగా అది తప్పుకాదా! ఒకసారి ఆలోచించండి, అన్యాయం చేసిన వారు, పొందినవారు కూడా తన పుత్రులే. కానీ కొందరు అన్యాయ మార్గంలో ఉన్నపుడు వారి తప్పును అలా ఒకేసారి చూపిస్తే వారు మరింత అన్యాయులుగా మరే అవకాశం ఉంటుంది. కనుక అన్యాయమునకు గురి అయిన నాభాగుని అతని విద్యాను ఉపయోగించి అతని ధనమును స్వయంగా సంపాదించుకునే మార్గం చెప్పి, కేవలం ధనమే కాకుండా బ్రహ్మజ్ఞాని అనే బిరుదు కూడా పొందగలవు అని చెప్పి పంపాడు.  
  4. మరి అంగిరసులు నాభాగునకు ఇచ్చిన అదే భాగమును ఋత్విక్కులు శివునకు ఎందుకు ఇచ్చారు? ఆ భాగమును ఎవరికైనా ఇవ్వటానికి ఎవరికి అధికారం ఉంటుంది? మనం ఒక బ్రాహ్మణుని యాగామునకు పిలిచి ఆ యాగమునకు కావలసినవి అన్నీ  సమకూర్చి వారికి అప్పగిస్తాం. అంటే ఆక్షణం నుండి ఆ వస్తు,ధనముల మీద ఆ బ్రాహ్మణులకే అధికారం ఉంటుంది. కనుక ఆ భాగమును దానం చేసే అధికారంకూడా ఋత్విక్కులకే ఉంటుంది. 
  5. శివుడు ఈ భాగం నాదే నీకు చెందదు అని స్వయంగా చెప్పకుండా నభగుని అడిగిరమ్మని ఎందుకు చెప్పాడు? ఒక కొడుకు తప్పు చేసే సమయం అని తెలిసినప్పుడు అతనిని సరిదిద్దే మొదటి అవసరం, భాద్యత తండ్రికి ఉండాలి. పైగా అక్కడ వచ్చే ధనమును తెచ్చుకోమని సలహా ఇచ్చిన వాడు నభగుడే. కనుక నభగుడు జరిగిన సంగతి తెలుసుకుని నాభాగునకు చెప్తేనే అది బాగుంటుంది. 
  6. అసలు ఏమిటి ఈ కధ? మనం మన మనస్సునందు ఈవిధమైన దురాలోచనలు లేకుండా, పెద్దలు చెప్పిన పనిని చేస్తూ ఉంటే మనకు చెందవలసిన సొమ్ము, పేరు, ప్రతిష్టలు మనను చేరి తీరుతాయి. ఒక్కసారి దానం మీది ఆశతో నాభాగుడు అబద్దం చెప్తే పరమశివుడు  అతనికి ఆ ధనమును తిరిగి ఇచ్చే అవకాశం ఉండేది కాదు కదా!
  7. మరి ఆ ఫలశృతి? ఈ కధను ప్రతిరోజూ చదవటం/ వినటం అంటే ప్రతిరోజూ గుర్తు చేసుకోవటం. అంటే మన మనస్సులలో ఈ కద నిలచిపోతుంది. ఒకవేళ మనకు ఎవరితో అయినా గొడవ పడవలసిన సందర్భం ఎదురయినప్పుడు మన మనస్సు ఆ గొడవ పడకుండా ఆపుతుంది. అప్పుడు మన మనస్సు మన ఆదీనంలో ఉండి విచక్షణా శక్తి ని కోల్పోకుండా ఉంటుంది. మరి అదేకదా జ్ఞానం అంటే. 
  8. జీవితాంతం మనం ఈ కధను స్మరిస్తూ ఉంటే జీవితంలో మనం చేసే తప్పులు గణనీయంగా తగ్గుతాయి కనుక మోక్షం కూడా లభించవచ్చు. 

29, సెప్టెంబర్ 2014, సోమవారం

పృషద్ధ్రుడు

పృషద్ధ్రుడు వైవస్వత మనువు యొక్క పుత్రుడు. అంటే సూర్య వంశస్థుడు.
విద్యాభ్యాసం చేస్తున్న సమయలో ఒకరోజు పృషద్ధ్రుడు ఆవుల మందను తీసుకుని అడవులకు వెళ్ళగా, పెద్ద వర్షం ప్రారంభం అయినది. అప్పుడు అతను ఆ ఆవులను అన్నింటిని ఒకచోటికి చేర్చి వాటిని అన్ని వైపుల నుండి కాపాడుతూ ఉన్నాడు. అప్పుడు ఒక పులి ఆ మందలో ఉన్న ఆవులపై దాడి చేసినది. ఐతే విపరీతమైన చీకటిగా ఉండుటవలన అతనికి ఆ ఆవుల మంద మధ్యలో పులి ఎక్కడ ఉన్నదో తెలియలేదు. కానీ సాహసవంతుడై తన కత్తిని తీసి తను పులిగా భావిస్తున్న జంతువును మెడమీద ఒక్క దెబ్బ వేసాడు. అయినా పులి గాండ్రింపు వినిపిస్తూనే ఉండుట విని రెండవసారి తన కత్తిని బలంగా ప్రయోగించాడు. ఈసారి ఆ జంతువు తల త్రెగి ప్రక్కన పడినది.
వర్షం తగ్గగానే తను  నరికిన తల ఒక ఆవుది  అని తెలుసుకుని తమ కుల గురువయిన వసిష్టుని వద్దకు వెళ్లి జరిగినది చెప్పాడు. గోహత్యా పాపం అత్యంత ఘోరమైనది కనుక పృషద్ధ్రుడు క్షత్రీయత్వమునకు అనర్హుడని, చండాలునిగా ఉండమని శపించాడు. 
అలా శాపం పొందిన పృషద్ధ్రుడు గురువుగారి అజ్ఞ తీసుకుని అరణ్యములకు వెళ్ళాడు. అక్కడ అన్ని జీవులయందు సమదృష్టి కలిగి, పిచ్చి వాని వలే  ఈ విధమైన కోరికలు లేకుండా, ఏది దొరికితే అది తిని కాలం గడిపి చివరకు అరణ్యములో పుట్టిన దావానలం లో చిక్కుకుని తన ప్రాణములను వదిలాడు. 

23, సెప్టెంబర్ 2014, మంగళవారం

ఐదవతనము

మన తెలుగునాట స్త్రీ సౌభాగ్యమునకు సంబంధించి ఎక్కువగా వినిపించేమాట ఐదవతనము. మరి ఇంతకీ ఆ ఐదవతనము అంటే ఏమిటి?
ఐదవతనము అంటే ఐదు శుభ, మంగళ కర వస్తువులను కలిగి ఉండుట.
ఆ అయిదు మంగళ కర వస్తువులు

  1. మంగళసూత్రము 
  2. పసుపు 
  3. కుంకుమ 
  4. గాజులు 
  5. మట్టెలు 
కనుకనే మన హిందూ స్త్రీలు సర్వదా ఈ ఐదు అలంకారములను ధరించి ఉంటారు. వీని వెనుక ఉన్న శాస్త్ర రహస్యములను మరోసారి చెప్పుకుందాం!

22, సెప్టెంబర్ 2014, సోమవారం

శుకమహర్షి జననం

శుక మహర్షి వేద వ్యాసుని పుత్రుడు.  శుక మహర్షి విచిత్రమైన ఆకారం కలవాడు. తల వరకు చిలుక, శరీరం మానవ దేహం.
శుక మహర్షి కూడా వేద వ్యాసుని వలే పుట్టుకతోనే పరమ జ్ఞాని. ఐతే తండ్రిని మించిన తనయుడు. మరి అటువంటి వాని పుట్టుకకు కారణం ఏమిటి?
సరస్వతి నది ఒడ్డున నివసిస్తున్న సమయంలో వ్యాసమహాముని కావ్యములను, పురాణములను రచిస్తూ ఉండేవారు. అలా ఉన్న సమయంలో వారు ఒక పిచుకల జంటను చూస్తూ ఉండేవారు. కొంత కాలమునకు ఆ పిచ్చుకలకు ఒక చిన్న పిచ్చుక జన్మించినది. ఆ చిన్ని పిచ్చుకకు వారు చూపించే ప్రేమను గమనిస్తూ ఉండేవారు వ్యాస భగవానులు. అలా ఆ పిచ్చుకలను చూసినప్పుదంతా తనకు ఒక పుత్రుడు లేడే  అనే భాద కలుగుతూ ఉండేది.
ఒకనాడు అరణిని మంధిస్తూ ఈ విధమైన క్షేత్రం లేకుండా పుత్రోదయం ఏ విధంగా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండగా వారి దృష్టి అటుగా వెళుతున్న ఘృతాచి అనే అప్సరస పై పడినది. పుత్రుని పొందాలన్న కోరికతో ఉన్న ఆయన శరీరం వీర్యమును స్కలించినది. ఐతే వ్యాస మహాముని తనను చూస్తూ ఉండగా అతని శరీరంలో కలుగుతున్న మార్పుని గమనించిన ఘృతాచి వ్యాసమహాముని తనను శపిస్తాడేమో అన్న భయంతో ఆమె చిలుకగా మారి ఎగిరిపోసాగినది.
అంటే వ్యాస భగవానునికి వీర్యస్కలనం అయిన  సమయమునకు అతని మనసును కదిలించిన క్షేత్రం చిలుకగా మారినది. కనుక ఆ సమయంలో జన్మించిన పుత్రునికి చిలుక రూపం రావలసి ఉన్నది. మానవుని రూపంలో ఉన్న వ్యాసుని రూపంకూడా రావలసి ఉన్నది కనుక శుకుని రూపం తలవరకూ చిలుక, మిగిలిన శరీరం మానవ ఆకృతిలో ఉంటాయి.



20, సెప్టెంబర్ 2014, శనివారం

అధర్మం వంశవృక్షం

ఇంతకు ముందు ధర్ముని భార్యల గురించి వారి సంతానమును గురించి చెప్పుకున్నాం కదా! మరి అధర్మం సంగతి? అది ఈ రోజు చెప్పుకుందాం! భాగవతం లో మరొక విచిత్రమైన విషయం చెప్పారు. ఈ అధర్మ వంశం గురించి కల్కి పురాణంలో కూడా చెప్పారు. 
అధర్ముడు స్వయంగా బ్రహ్మ కు పుత్రునిగా జన్మించాడు.
అధర్మునకు భార్య అబద్దం. వీరి సంతానం దంబం(ఇప్పుడు దబాయించుట అంటున్నాం!) అనే పుత్రుడు, మాయ అనే పుత్రిక.
పుత్రికను నిరృతి (అసలు సత్యం అంటే తెలియని వాడు) చేపట్టాడు. వారికి లోభుడు, నికృతి (తిరస్కారం) జన్మించారు.
లోభుడు, నికృతి వివాహం చేసుకోగా వారికి క్రోధము, హింస జన్మించారు.
క్రోధం, హింస వివాహం చేసుకొనగా వారికి కలి, నింద జన్మించారు.
కలి, నింద  వివాహం చేసుకోగా వారికి భయము. మృత్యువు జన్మించారు
భయం, మృతువు వివాహం చేసుకోగా వారికి యాతన మరియు నరకము పుట్టిరి.

నా ఆలోచన:
ఇక్కడ పెద్దగా విశ్లేషించ వలసిన పని లేదు కదా! అంతా చక్కగా చెప్పారు.
మనిషిలోనికి ఎప్పుడయితే అధర్మం ప్రవేశిస్తుందో అప్పుడు అబద్దం బయలుదేరుతుంది. అవి రెండూ రాగానే ఎదుటివానికి మాయమాటలు చెప్పుట, వారిని దబాయించుట చేస్తాం! అప్పుడు వానితో పాటుగా ఎదుటి వారు చెప్పే విషయాలను తిరస్కరిస్తూ ఉంటాం. లోభం కూడా ప్రారంభం అవుతుంది.
దాని ఫలితంగా క్రోధం మనస్సులో స్థానం సంపాదించుకుంటుంది. ఆ క్రోధం హింసను ప్రోత్సహిస్తుంది. దానిద్వారా ఇతరులను నిందించాలన్న ఆలోచన మొదలవుతుంది. అక్కడి నుండి నన్ను ఎవరైనా చంపేస్తారేమో అనే భయం మొదలవుతుంది. దానిని మించిన నరకము. యాతన ఉండవు కదా!

పైన చెప్పినవి అన్నీ  మనలోని విషయములే తప్ప అధర్ముడు అనే ఒక వ్యక్తికి అబద్దం అనే భార్య అని చదువుకుంటే అది పై విషయాన్ని అన్వయించుకునే విషయంలో మనకు ఎంతో జుగుప్సాకరంగా ఉంటుంది. పూర్వికులకు ఒక కధలా చెప్పటం అలవాటు కనుక మనకు అర్ధం అవటానికి ఇలా ఆ భావనల మధ్య అనుభందాలను చూపాలని చేసిన చిన్న ప్రయత్నం అని నా అభిప్రాయం. 

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఉత్తానపాదుడు

స్వయంభుమనువునకు శతరూప యందు జన్మించిన పుత్రుడు ఉత్తానపాదుడు(పాదములు ఎత్తిన వాడు, సర్వ సిద్దంగా ఉన్నవాడు).
ఉతానపాదునకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. వారి ఇరువురి యందు ఇద్దరు పుత్రులు కలిగారు. పెద్ద భార్య అయిన సునీతికి దృవుడు పెద్దవాడు, రెండవ భార్య కుమారుడు ఉత్తముడు చిన్నవాడు. ఉత్తనపాదునకు తన రెండవ భార్య అంటే ఉన్న అమితమైన ప్రేమ కారణంగా అతను సర్వదా మొదటి భార్య అయిన సునీతిని నిరాదరిస్తూ వచ్చాడు. ఆమె పుత్రుడయిన కారణంగా దృవునికి కూడా తండ్రి ప్రేమ దొరకలేదు.
ఒకనాడు ఉత్తానపాదుడు తన విశ్రామ సమయంలో చిన్న భార్య కుమారుడయిన ఉత్తముడిని ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తూ ఉండగా, తండ్రి ప్రేమను పొందాలన్న కోరికతో బాలుడయిన దృవుడు తండ్రి వద్దకు పరుగెత్తాడు. ఐతే తన చిన్న భార్య చూస్తున్నది అని భావించిన ఉత్తానపాదుడు దృవుని దగ్గరకు తీసుకోలేదు. అది సురుచి అహంకారమును పెంచినది. ఆమె చిన్న పిల్లవానితో ఏమి మాట్లాడుతున్నదో కూడా తెలియని భావోద్వేగములకు లోనయినది.
"నీ తండ్రి ఒడిలో కూర్చోటానికి వచ్చావా? నీకు ఆ అర్హత లేదు, ఒకవేళ ఉన్నట్లయితే నీవు నా కడుపున నా పుత్రునిగా జన్మించేవానివి. ఇప్పుడయినా మార్గం ఒకటి ఉన్నది. నీవు ఆ మహావిష్ణువుని ప్రార్ధించి, అతని వరములను పొంది నా గర్భంలో జన్మించు, అప్పుడు తప్పకుండా నీ తండ్రి ఒడిలో కూర్చునే అధికారం పొందగలవు"

సురుచి అంటున్న ఈ మాటలను విన్న తరువాత కూడా ఉత్తానపాదుడు ఏమి మాట్లాడలేదు. తన పుత్రుడిని అతని భార్య అవమానిస్తూ మాట్లాడినా, ఆ పిల్లవానికి ఆమె చెప్తున్న విషయం అర్ధంకాదు అని తెలిసినా, ఆమె అతని ప్రేమ వలెనే ఆమె ఇంతగా అతిశయించినది అని తెలిసినా ఆమెను ఏమీ  అనలేదు.
సవతి తల్లి అనిన మాటలు, ఆ మాటలు వింటూ కూడా బదులు చెప్పని తన తండ్రి వలన అవమానంగా భావించి, తన తల్లి అయిన సునీతి ఆ తరువాత నారదుని ఉపదేశం మీద అడవులకు వెళ్లి తపస్సు చేయసాగాడు.
అప్పుడు ఉత్తానపాదునికి అతని తప్పు తెలిసివచ్చినది. అడవుల పాలయిన తన పుత్రుని కోసం ఎదురు చూడసాగాడు. తపస్సు ముగించుకుని రాజ్యమునకు తిరిగి వచ్చిన దృవునకు రాజ్యాభిషేకం చేసాడు. 

13 మంది దక్షుని పుత్రికలు

శ్రీమద్భాగవత మహా పురాణంలో దక్షుని గురించి చెప్పారు. దక్షుడు అంటే మనకు తెలుసు మహాదేవుని మామగారు.
దక్షుని భార్య పేరు ప్రసూతి. ఆమె స్వయంభుమనువు కుమార్తె.
దక్షునికి ఆమె భార్య యందు కలిగిన అనేక మంది పుత్రికలలో 13 మంది పుత్రికలను ధర్మునకు ఇచ్చి వివాహం చేసారు. వారి పేర్లు
  1. శ్రద్ద 
  2. మైత్రి 
  3. దయ 
  4. శాంతి 
  5. తుష్టి 
  6. పుష్టి 
  7. క్రియ 
  8. ఉన్నతి 
  9. బుద్ధి 
  10. మేధ 
  11. తితిక్ష 
  12. హ్రీ 
  13. మూర్తి 
నా ఆలోచన:
మన పెద్దలు ప్రతి విషయమును చదువుతున్న మన అందరికి అర్ధం అయ్యే విధంగా చక్కగా చిన్నగా ఆ రహస్యములను చెప్తారు. మనం చేసే ప్రతి చిన్న పనికి ఏవిధమైన ఫలితం లభిస్తుందో ఈ సందర్భంగా చెప్పారు అని నా అభిప్రాయం. 
ఇక్కడ చెప్పిన 13 మంది దక్షుని పుత్రికలు నిజంగా స్త్రీలేనా? ఐతే అయి ఉండవచ్చు కానీ వారు ఈ పుత్రికలను ధర్మునకు ఇచ్చుట ద్వారా ఏమి ఫలమును పొందారని చెప్పదలచుకున్నారో చూద్దామా!

ఈ 13 మందిని ధర్మునకు ఇచ్చారు. ధర్ముని వల్ల వారికి కలిగిన సంతానం 
  1. శ్రద్ద - శ్రుతము (వినవలసినది), : ధర్మమును శ్రద్దగా వినుము 
  2. మైత్రి - ప్రసాదము (ప్రసన్నత/ అనుగ్రహము) : ధర్మము నందు మైత్రి (స్నేహం) తో ఉండుట వలన ప్రసన్నత కలుగును 
  3. దయ - అభయము : ధర్మముతో కూడిన దయ వలన అభయము కలుగుతుంది 
  4. శాంతి - సుఖము : ధర్మముతో కూడిన శాంతి వలన సుఖము లభిస్తుంది 
  5. తుష్టి (సంతృప్తి) - సంతోషం : ధర్మం తో కూడిన సంతృప్తి వలన సంతోషం 
  6. పుష్టి (బలము) - స్మయం (ఆశ్చర్యం) : ధర్మం తో కూడిన బలం వలన ఆశ్చర్యకరమైన ఫలితములు 
  7. క్రియ (పని) - యోగము : ధర్మం తో చేసిన పని వలన ఆ పని తప్పని సరిగా యోగిస్తుంది 
  8. ఉన్నతి - దర్పము : ధర్మం తో కలిగిన ఉన్నతి వలన దర్పం ప్రప్తిస్తున్నది 
  9. బుద్ధి - అర్ధం (లాభం/ ప్రయోజనం) : ధర్మం తో కూడిన బుద్ధి వలన లాభం కలుగుతుంది  
  10. మేధ - స్మృతి (జ్ఞాపకం) : ధర్మం కలిగిన మేధ వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది 
  11. తితిక్ష(ఓర్పు) - క్షేమము : ధర్మం తో కూడిన ఓర్పు సర్వదా క్షేమకరం 
  12. హ్రీ (లజ్జ/సిగ్గు)- అనునయము : ధర్మముతో కూడిన సిగ్గుకు సర్వదా అనునయము చేరుతుంది 
  13. మూర్తి (రూపం)- నరనారాయణులు : మనలో ధర్మం సాంతం మూర్తీభవించి ఉన్నట్లయితే భగవత్ స్వరూపం మనలను కాపాడుతూనే ఉంటుంది. 

18, సెప్టెంబర్ 2014, గురువారం

అష్ట దిగ్గజములు

మన పురాణముల ప్రకారం ఈ భూభారమును అష్టదిక్కులలో అష్ట గజములు (ఏనుగులు) వహిస్తూ ఉంటాయి. వాటినే అష్టదిగ్గజములు అంటాం. వాని పేర్లు

  1. ఐరావతం 
  2. పుండరీకం 
  3. వామనం 
  4. కుముదం 
  5. అంజనం 
  6. పుష్పదంతం 
  7. సార్వభౌమం 
  8. సుప్రతీకం 

17, సెప్టెంబర్ 2014, బుధవారం

31 మంది అప్సరసలు


పురాణముల ప్రకారం దేవలోకంలో ఎందరో అప్సరసలు ఉన్నారు. బ్రహ్మ పురాణం లో వారిలో 31 మంది పేర్లు ఇచ్చి ఉన్నారు. వారి పేర్లు


  1. రంభ 
  2. ఊర్వశి 
  3. తిలోత్తమ 
  4. మేనక 
  5. ఘృతాచి 
  6. సహజన్య 
  7. నిమ్లోచ 
  8. వామన 
  9. మండోదరి 
  10. సుభగ 
  11. విశ్వాచి 
  12. విపులానన 
  13. భద్రాంగి 
  14. చిత్రసేన 
  15. ప్రమ్లోచ 
  16. మనోహర 
  17. మనోమోహిని 
  18. రామ 
  19. చిత్రమధ్య 
  20. శుభానన 
  21. సుకేశి 
  22. నీతకుంతల 
  23. మన్మధోద్దీపిని 
  24. అలంబుష 
  25. మిత్రకేసి 
  26. ముంజికస్థల 
  27. క్రతుస్థల 
  28. వలాంగి 
  29. పరావతి 
  30. మహారూప 
  31. శశిరేఖ 

కల్పం

మనకు కాలం లెక్కింపు నిముషములు, రోజులు, వారములు మరియు నెలల రూపంలో చేస్తాం కదా! ఇంతకూ ముందు మనం మనువులు, యుగములు గురించి తెలుసుకున్నాం! ఇప్పుడు బ్రహ్మగారి సమయము గురించి తెలుసుకుందామా!
బ్రహ్మదేవుని ఒక్కరోజులో 14 మన్వంతరములు జరుగుతాయి. బ్రహ్మదేవుని ఒక్క రోజును కల్పం అంటారు. అంటే
కల్పం = 14 మన్వంతరములు
ఇటువంటి కల్పములు 30 ఐతే బ్రహ్మగారికి ఒక నెల. నెలలోని ఆ 30 రోజులకు పేర్లు మస్త్య పురాణంలో చెప్పబడ్డాయి.
అవి

  1. శ్వేత 
  2. నీలలోహిత 
  3. వామదేవ 
  4. రత్నాంతర 
  5. రౌరవ 
  6. దేవ
  7. బృహద్ 
  8. కందర్ప 
  9. సద్యః 
  10. ఈశాన 
  11. తమో 
  12. సారస్వత 
  13. ఉదాన 
  14. గరుడ 
  15. కౌర 
  16. నారసింహ 
  17. సమాన 
  18. ఆగ్నేయ 
  19. సోమ 
  20. మానవ 
  21. తత్సుమాన 
  22. వైకుంఠ 
  23. లక్ష్మి 
  24. సావిత్రి 
  25. అఘోర 
  26. వరాహ 
  27. వైరాజ 
  28. గౌరి 
  29. మహేశ్వర 
  30. పితృ 
ఇవే కాక అనేకములయిన కలపముల పేర్లు చెప్పబడి యున్నాయి.
To read the same in english click here.


భగవంతుడు

 మనం దేవుని గురించి మాట్లాడుకునే సమయంలో భగవంతుడు అని సంభోదిస్తాం. ఐతే మన పురాణముల, శాస్త్రముల ప్రకారం వారు ఈ "భగవంతుడు" కు అర్ధం చెప్పే ప్రయత్నం చేసారు. అది

భగవంతుడు = భగ+ వంతుడు = భగమును కలిగి ఉన్నవాడు

మరి భగం అంటే?

ఐశ్వరస్య సమగ్రస్య వీర్యస్య యశస్యః శ్రీయః
జ్ఞాన వైరాగ్య యొస్చాపి షణ్ణాంవర్గో భగస్మృతః

భగము అనగా ఆరుగుణముల సమాహారం. ఆ ఆరు గుణములు
  1. జ్ఞానం 
  2. శక్తి 
  3. బలం 
  4. ఐశ్వర్యం 
  5. వీర్యం 
  6. తేజస్సు 
ఐతే మనకు కూడా ఆపి అన్ని గుణములు ఉన్నాయి కదా! ఐతే మనమే భగవంతులం!  నిజమే అందుకనే ప్రతి ప్రాణిలోనూ భగవత్ స్వరూపం చూసే అలవాటు మనకు ఉన్నది. 
ఐతే ఈ సర్వ సృష్టిలో మనకు మించిన వారు ఎవరో ఒకరు, ఎక్కడో ఒక చోట ఉంటారు. అలా అందరికన్నా అన్ని గుణములలో సర్వ ఉత్తముడు ఎవరో వాడే భగవంతుడు. 

ధర్మ సంతానం

మనకు అనేక పురాణములలో, అనేక కధలలో పూర్వులు పుత్రునికోసం అనేక మార్గములను అన్వేషించారని, వాని ద్వారా సంతానం పొందారని చెప్తారు. అటువంటి వాటిలో రామాయణంలో పుత్రకామేష్టి, మహాభారతంలో కుంతికి భర్త అనుమతితో మరొకరి చే కుమారుని పొందుట మొదలయినవి. ఐతే అవే పురాణముల ప్రకారం ధర్మసమ్మతమైన పుత్రులను 12 రకములుగా పొందవచ్చును. ఆ విధములు ఏమిటో తెలుసుకుందామా!


  1. ఔరస: సహజంగా భార్య, భర్తలకు జన్మించే వాడు 
  2. దౌహిత్ర: ఒక తండ్రికి కేవలం పుత్రికలే కలిగినట్లయితే ఆమెకు కన్యాదానం చేసే సమయంలో తమ అల్లుని, వారికి కలుగాబోయే మొదటి పుత్రా సంతానమును వారి వంశమునకు ఉద్దరకునిగా ఇచ్చే ఒప్పందం చేయించుకుని, వానిని స్వీకరించుట. అర్జునుని కుమారుడు బబృవాహనుడు 
  3. క్షేత్రజ: తన భార్య యందు తన అంగీకారంతో పరులవలన కలిగిన వారు. పాండవులు 
  4. అత్రిమ : దత్త పుత్రుడు. కన్న తల్లిదండ్రులు దానం చేయగా మన ఇంటికి వచ్చిన వాడు. 
  5. కృత్రిమ: అనాధగా పెరుగుతున్న వాడిని తెచ్చి పెంచినట్లయితే వాడు కృత్రిముడు. రాధేయుడు 
  6. గూడజ: భర్త అనుమతి లేకుండా పర పురుషుని వల్ల కలిగిన వాడు. 
  7. అపవిద్ధ: కన్న తల్లిదండ్రులచేత విడువబడి, మరొకరిని స్వయంగా తల్లిదండ్రులుగా భావించి వారిచే పెంచబడిన వాడు 
  8. కానీన : స్త్రీకి వివాహమునకు ముందుగా జన్మించిన వాడు. కర్ణుడు 
  9. సహోదుడు : స్త్రీ గర్భవతి అని తెలియక వివాహం చేసుకున్న తరువాత జన్మించిన వాడు 
  10. పునర్భవ : భర్త చనిపోయిన తరువాత, స్త్రీకి మరొకరి వలన జన్మించే వారు. చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు 
  11. స్వయం దత్త : కన్న తల్లిదండ్రులు ఎవరో తెలిసినా, తెలియకపోయినా మరొకరిని తల్లి తండ్రులుగా భావించి సేవలు చేసే వాడు. 
  12. క్రీత : కన్న తల్లిదండ్రులచే అమ్మబడి, మన ఇంటికి వచ్చి పెరిగిన వాడు. లోహితాస్వుడు 

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

అష్ట కష్టములు

మనం సహజంగా చాలా కష్ట పడి ఏదయినా పని చేశాం అని చెప్పటానికి పర్యాయపదంగా అష్ట కష్టములు పడి ఆ పనిని సాధించాం అని చెప్తాం కదా! మరి నిజంగా అష్ట కష్టములు అంటే ఏమిటో చూద్దామా!

  1. దారిద్యం  
  2. దాస్యము 
  3. భార్యావియోగం 
  4. యాచనం 
  5. స్వయం కృతాపరాధం 
  6. అప్పు పుచ్చుకుని భాదపడుట 
  7. ప్రయత్న విఫలం 
  8. అనారోగ్యం 


14, సెప్టెంబర్ 2014, ఆదివారం

పంచ మలములు

భగవంతుని చేరే సాధనలో సాధకునికి అనేక విషయములు అడ్డంకిని కలిగిస్తాయి. వానినే మలములు అంటారు. అవి ఐదు
1. ఆణవ మలము: భగవంతుని గురింఛి తెలుసుకునే ప్రయత్నంలో ఆ జ్ఞానమును మరుగున పరచునది
2. కార్మిక మలము : గురువుగారు చెప్పే విషయములను అర్ధంచేసుకునే క్రమం లో అడ్డు వచ్చేది
3. మాయిక మలము : సర్వదా దైవ చింతనకు దూరమ్ గా ఉంచుతూ, జ్ఞాన సముపార్జన చేయకుండా చేసేది
4. మాయేయ మలము : సర్వదా పాపములు చేయుటకు ప్రోత్సహించునది
5. తిరోధాన మలము : పరమాత్మను మరిపింపచేసి, జనన, మరణములే జీవితం అని భాసింప చేసేది.


తెలుగు నెలల పేర్లు - చంద్రుడు

చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉండుట వల్లనే మనం చంద్రమానం ప్రకారం కాలమును గణిస్తాం.
చంద్రుడు అమావాస్య నుండి మరో అమావాస్య వరకు పయనించే కాలమును నెల అంటారు. ఇది సుమారుగా 30 రోజుల సమయం పడుతుంది. చంద్రుడు తన సర్వకళలతో నిండుగా ఉండే రోజును పౌర్ణిమ అంటాం.
ఐతే ఆ పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షతంతో ఉంటాడో ఆ నెలకు పేరు ఆ నక్షతం ద్వారానే కలుగుతుంది. ఎలాగో చూద్దామా!

  1. చైత్రం - చంద్రుడు చిత్తా నక్షత్రం తో ఉంటాడు. 
  2. వైశాఖం - చంద్రుడు విశాఖ నక్షత్రం తో ఉంటాడు. 
  3. జ్యేష్టం -చంద్రుడు జ్యేష్టా నక్షత్రం తో ఉంటాడు. 
  4. ఆషాడం -చంద్రుడు పూర్వ/ఉత్తర ఆషాడ నక్షత్రం తో ఉంటాడు. 
  5. శ్రావణం - చంద్రుడు శ్రవణ నక్షత్రం తో ఉంటాడు. 
  6. భాద్రపదం - చంద్రుడు పూర్వ/ఉత్తర భాద్ర నక్షత్రం తో ఉంటాడు. 
  7. ఆశ్వియుజ - చంద్రుడు అశ్విని నక్షత్రం తో ఉంటాడు. 
  8. కార్తీక - చంద్రుడు కృత్తిక నక్షత్రం తో ఉంటాడు. 
  9. మార్గశిర -  చంద్రుడు మృగశిర నక్షత్రం తో ఉంటాడు. 
  10. పుష్యం - చంద్రుడు పుష్య నక్షత్రం తో ఉంటాడు. 
  11. మాఘం - చంద్రుడు మఖ నక్షత్రం తో ఉంటాడు. 
  12. ఫల్గుణ - చంద్రుడు పూర్వ/ఉత్తర ఫల్గుణ నక్షత్రం తో ఉంటాడు. 

13, సెప్టెంబర్ 2014, శనివారం

ఐదు శక్తులు

మన పురాణముల ప్రకారం శక్తులు ఐదు రకములు
అవి
1. పరాశక్తి : ఆకర్షణకు కారణము - ఇది దైవిక శక్తి
2. ఆదిశక్తి : మనలోని పంచ ప్రాణములకు ఆధారము - ఇది స్వాభావికమైన శక్తి
3. జ్ఞానశక్తి : జ్ఞానమునకు కారణం, ఇంద్రియముల శక్తికి ఆధారం
4. ఇచ్ఛాశక్తి : ఆలోచనలకు, సంకల్పమునకు ఆధారం
5. క్రియా శక్తి : శారీరికమైన క్రియలకు ఇది ఆధారం.


నక్షత్రములు

నక్షత్రములు 27. వారు అందరిని దక్షుని కుమార్తెలుగా చెప్తారు. వారి పేర్లు 
  1. అశ్విని  
  2. భరిణి 
  3. కృత్తిక 
  4. రోహిణి 
  5. మృగశిర 
  6. ఆరుద్ర 
  7. పునర్వసు 
  8. పుష్య 
  9. ఆశ్లేష 
  10. మాఘ/ మఖ 
  11. పూర్వ ఫల్గుని 
  12. ఉత్తర ఫల్గుణి 
  13. హస్త 
  14. చిత్త 
  15. స్వాతి 
  16. విశాఖ 
  17. అనురాధ 
  18. జ్యేష్ట 
  19. మూలా 
  20. పుర్వాషాడ 
  21. ఉత్తరాషాడ 
  22. శ్రవణ 
  23. ధనిష్ఠ 
  24. శతభిష 
  25. పూర్వాభాద్ర 
  26. ఉత్తరాభాద్ర 
  27. రేవతి 

12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఇల/సుద్యుమ్నుడు విచిత్రం

సూర్యవంశం లో జన్మించిన ఇల, వసిష్టుని కారణం గా సుద్యుమ్నునిగా(పురుషునిగా) మారినది. సుద్యుమ్నుడు తన తండ్రి అయిన వైవస్వతమనువు రాజ్యమును చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నారు.
ఒకసారి సుద్యుమ్నుడు తన సైన్యంతో కలిసి అడవికి వేటకు వెళ్ళాడు. అతిశయించిన ఉత్సాహంతో ఉత్తర దిశగా క్రూరమృగములను తరుముతూ వెళ్లారు. అలా వెళ్లి వెళ్లి చివరకు స్త్రీవనములో ప్రవేశించారు. వెంటనే పరమేశ్వరుని అజ్ఞానుసారం సుద్యుమ్నుడు మరలా స్త్రీగా (ఇలగా)మారి పోయాడు. అతనితో పాటుగా అక్కడకు వచ్చిన అతని సైన్యంకూడా స్త్రీలుగా మారిపోయారు.
ఈవిధముగా అనుకోని పరిస్థితులలో స్త్రీలుగా మారిన వారు ఆ అడవుల్లోనే నివసించసాగారు. ఇల రాకుమార్తె వలే నివసించుచుండగా, సైనికులు ఆమెకు చెలికత్తెలై ఉన్నారు. వారు ఆ విధంగా ఉంటున్న సమయంలో ఒకరోజు చంద్రుని కుమారుడయిన బుధుని (నవ గ్రహములలో ఒకరు) ఆశ్రమం చేరారు.
బుధుడు ఇలను చూసి మోహించాడు, వారు వివాహం చేసుకున్నారు. వారికి పురూరవుడు అనే పుత్రుడు జన్మించాడు. ఈవిధంగా చంద్రవంశం వృద్ధి ప్రారంభం అయినది.
వీరిని గురించి తెలిసిన వైవస్వతమనువు విచారం మరింతగా పెరిగినది. సూర్యవంశ వృద్ధికి కారకుడు కావలసిన తన పుత్రుడు, పుత్రిక రూపంలో చంద్రవంశ వృద్ధికి పునాదులు వేసాడు. తన మనో విచారమును తన గురువైన వసిష్టునకు విన్నవించగా, వసిష్టుడు పరమేశ్వరుని గురించి ప్రార్ధన చేసాడు.
వసిష్టుని ప్రార్ధనలు విన్న పరమేశ్వరుడు ఇలను పురుషునిగా మార్చినట్లయితే అతని శాపం తప్పినట్లు అవుతుంది, అలా కాకుండా ఆమెను స్త్రీగానే ఉంచేస్తే, వసిష్టుని సంకల్పం తప్పినట్లు అవుతుంది కనుక మధ్యే మార్గంగా ఆమెను ఒక నెల రోజుల పాటు పురుషునిగా, మరో నెల రోజులు స్త్రీ గా ఉండే ఏర్పాట్లు చేసారు.
అప్పటినుండి పురుషునిగా ఉన్న నెలరోజులు రాజ్యపాలన చేస్తూ, స్త్రీగా ఉన్న నెలరోజులు ఇలగా అంతఃపురంలో జీవనం సాగిస్తూ ఉన్నాడు.
సుద్యుమ్నునకు అతని భార్య వలన ముగ్గురు కుమారులు జన్మించారు. వారు ఉత్కళుడు, గయుడు మరియు విమలుడు. వీరు ముగ్గురు అత్యంత ధర్మ పారాయణులు, వీరు ఉత్తర దిశలో గల రాజ్యమును పరిపాలించారు.
సుద్యుమ్నుడు వృద్ధాప్యం వచ్చేవరకు రాజ్యపాలన చేసి, అవసాన దశలో తన పుత్రుడయిన పురూరవునకు ప్రతిష్టానపురము అనే రాజ్యమును ఇచ్చి వనములకు వెళ్ళాడు.

నా ఆలోచన:
ఇంతకు ముందు చెప్పినట్లు మన పూర్వీకులకు లింగమార్పిడి గురించిన అద్వితీయమైన జ్ఞానం ఉన్నది. నిస్సంకోచముగా! ఎందుకంటే (నాకు తెలిసినంత వరకు) ఈ రోజులలో జరుగుతున్న లింగ మార్పిడి కేవలం శారీరక మైనది. అలా లింగ మార్పిడి జరిగిన ఎవరూ మార్పు చెందిన లింగమునకు సంబందించిన జీవ ప్రక్రియలు చేయలేరు. ఒక పురుషుడు స్త్రీగా మారితే అతను మిగిలిన స్త్రీలవలే గర్భధారణ చేసే అవకాశం ఉండదు. ఒక స్త్రీ పురుషునిగా మారితే ఆమె మరొక స్త్రీ ద్వారా పుత్రులను పొందుట అసంభవం.
కాని పూర్వకాలం లో ఇల/సుద్యుమ్నుని విషయంలో వారు తప్పని సరిగా విజయం సాధించారు. స్త్రీగా ఉన్న ఇల పురూరవునికి జన్మను ఇచ్చినది. పురుషునిగా ఉన్నపుడు తన భార్య ద్వారా మ్రుగ్గురు పుత్రులను పొందటంజరిగింది. 

పంచ కర్మేంద్రియములు

మానవుడు తన నిత్య జీవనములో పనులు చేసుకొనుటకు ఉపయోగపడే శరీరభాగములు ఐదు. అవి

1. కాళ్ళు
2. చేతులు
3. నోరు
4. ఉపస్థ
5. పాయువు 

ఇల జననం

వైవస్వతమనువు మనకు గల 14 మంది మనువులలో ఏడవ వాడు. ప్రస్తుతం మనం ఉన్న మన్వంతరమునకు అధిపతి.
ఇతను సూర్య భగవానుని కుమారుడు కనుక సూర్య వంశస్తుడు. శ్రద్దాదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి వివాహం అయిన చాలాకాలం వరకు వారికి సంతానం కలుగ లేదు. కనుక వసిష్ఠ మహామునిని వారి పుత్ర ప్రాప్తి కోసం ఒక యజ్ఞం చేయమని కోరారు.
ఐతే శ్రద్ధాదేవికి పుత్రిక పై మమకారం కలుగుట  వల్ల ఆమె వసిష్టునకు చెప్పే సాహసం చేయలేక ఆ యజ్ఞములో హోతగా ఉండే వ్యక్తి వద్దకు వెళ్లి అతను యజ్ఞములో పుత్రికను కాంక్షిస్తూ ఆజ్యమును విడువమని కోరినది. దానికి అంగీకరించిన హోట అలాగే చేసెను.
ఆ యజ్ఞం చేసిన కొంతకాలమునకు శ్రద్దాదేవి గర్భందాల్చెను. తరువాత ఒక ఆడపిల్లకు జన్మనిచ్చెను. ఆ ఆడపిల్లకు ఇల అని నామకరం చేసారు.
కొంతకాలం తరువాత వైవస్వతమనువు వసిష్టుని వద్దకు వెళ్లి, " తమవంటి అత్యంత నిష్టా గరిష్టులు చేసిన యజ్ఞం, తమరు చేసిన సంకల్పమునకు విరుద్దంగా ఎలా ఫలితమును ఇచ్చినది?" అని అడిగెను.
జరిగిన విషయమును తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్న వసిష్టుడు వైవస్వతమనువునకు విషయం చెప్పి, తనకు ఉన్న శక్తిచేత ఇలను పురుషునిగా మార్చగలను అని ఆమెను పురుషునిగా మార్చారు. పురుషునిగా మారిన ఇలను సుద్యుమ్నుడు అని పిలిచారు.


నా ఆలోచన:
మనకు ఈ కాలంలో ఉన్నట్లుగా బాలికల పట్ల వివక్షత ఆ రోజులలో ఉన్నట్లు కనిపించుట లేదు. పుట్టినది బాలిక అని తెలిసినా ఆమెకు నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచారు గానీ పుట్టగానే పుత్రుని బదులుగా పుత్రిక జన్మించినది అని గురు వసిష్టుల వద్దకు పరుగులు పెట్టలేదు.

మరి ఒక బాలికను బాలునిగా ఎందుకు మార్చారు?

ఇక్కడ తప్పు శ్రద్దాదేవిది. ఆమెకు ఆడపిల్ల కావాలని కోరిక ఉన్నపుడు ఆమె తన భర్తకు చెప్పి ఉండాలి. కనీసం ఆ యజ్ఞ భాద్యతను నిర్వహిస్తున్న వసిష్టునకు కూడా చెప్పలేదు. హోత  అంటే మన ఈకాలంలో వాడుక భాషలో చెప్పాలంటే ఒక సహాయకునికి చెప్పినది.
యజ్ఞ సంకల్పం చేయబడినది ఒక పుత్రుని కోసం, కనుక పుట్టిన వాడు పుత్రుడే అయి తీరాలి. కాని తల్లి కోరిక మీద పుత్రిక జన్మించినది. ఈ సమస్యకు పరిష్కారం లింగమార్పిడి.
మనకు ఇప్పుడు తెలిసిన లింగమార్పిడి విధానం మన కన్నా విపులంగా మన పూర్వులకు బాగా తెలుసు.




11, సెప్టెంబర్ 2014, గురువారం

స్త్రీ వనము

మన పురాణములలో ఒక విచిత్రమైన వనం (తోట) గురించి చెప్పారు. అది స్త్రీవనం. ఆ వనంలోకి స్త్రీలు మాత్రమే  అడుగుపెట్టగలరు. ఒకవేళ పురుషులు ఎవరైనా అడుగుపెడితే వారు కూడా స్త్రీలు అయిపోతారు. ఎందుకు?

ఒక రోజు శివ పార్వతులు ఒక వనంలో క్రీడించుచుండగా, ఆ విష్యం తెలియని జ్ఞానవంతులైన, దిగంబరులయిన మునులు శివ దర్శనార్ధమై వచ్చారు. అప్పుడు ఆ సమయంలో దిగంబరులయిన మునులను చూసిన పార్వతీదేవి కించిత్ సిగ్గుపడి పక్కకు వెళ్ళినది. శివపార్వతుల ఏకాంతమును భంగం చేసాం అనే అపరాధ భావనతో ఆ మునులు అక్కడి నుండి నరనారాయణులు నిరంతరం తప్పస్సులో మునిగి ఉండే బదరికి వెళ్ళిపోయారు.
కానీ తమ ఏకాంతమునకు  ఇటువంటి ఒక విఘ్నం ఇకమీదట కలుగ కూడదనే పార్వతి మనోసంకల్పం తెలుసుకున్న మహాదేవుడు ఒక నిర్ణయం చేసాడు. ఆనాటి నుండి ఎవరైతే ఆ వనంలో అడుగు పెడతారో వారు స్త్రీలుగా మారిపోతారు.

ఎందుకు ?
ఎందుకంటే ఆ రోజు వచ్చినది దిగంబరులయిన మునులు. వారికి శరీర సంబందమైన ఏ విధమైన విషయంలోనూ ఆసక్తి ఉండదు. అటువంటి వారిని ఆ వనం లోనికి రావద్దు  అని చెప్పలేరు. అలాగని వారికి శరీరం గురించిన సిగ్గు వంటి భావనను ధరించమని భోదించలేరు. దీనికి మధ్యే మార్గం సహజంగా సిగ్గుతో ఉండే స్త్రీలయితే బాగుంటుంది అని. ఒకవేళ ఇటువంటి మునులు మరలా అక్కడకు వస్తే అక్కడ ప్రవేశించగానే స్త్రీలుగా మారిపోతారు. అప్పుడు స్త్రీకి సహజమైన సిగ్గు కారణంగా వారు వస్త్రములను ధరిస్తారు.


పంచ భూతములు

సకల జీవకోటికి ప్రాణాధారం పంచ భూతములు అవి
  1. ఆకాశము 
  2. వాయువు 
  3. అగ్ని 
  4. జలం 
  5. భూమి 

తన్మాత్రలు

మానవ శరీరంలో గల పంచ జ్ఞానేంద్రియములకు, పంచ భూతములను తెలుసుకొన గలిగిన జ్ఞానమును తన్మాత్రలు అంటారు. అవి కూడా ఐదే. అవి

  1. శబ్దం 
  2. స్పర్శ 
  3. రూపం 
  4. రుచి 
  5. వాసన 

జ్ఞానేంద్రియములు

జ్ఞానేంద్రియములు ఐదు. అవి మానవునికి పంచ భూతముల ఉనికిని తెలిసేలా చేస్తాయి.
అవి

  1. చెవులు 
  2. చర్మం 
  3. కన్నులు 
  4. నాలుక 
  5. ముక్కు 

అష్ట ప్రమాణములు

లోకములో ఏదయినా విషయమును నిర్ధారించుటకు సహజంగా 8 పద్దతులు ఉన్నాయి. వాటిని అష్ట ప్రమాణములు అంటారు. అవి
  1. ప్రత్యక్షము
  2. అనుమానం 
  3. ఉపమానం 
  4. శబ్దము 
  5. అర్దాపత్తి 
  6. అనుపలబ్ది 
  7. సంభవం 
  8. ఐతిహ్యం 



అవస్థాష్టకం

మానవ జీవితంలో ఉన్న దశలను పురాణముల ప్రకారం ఎనిమిదిగా సూచించారు. అవి
  1. శైశవం  - పుట్టినప్పటి నుండి  5 సంవత్సరముల వరకు 
  2. బాల్యం/ కౌమారం - 5 సంవత్సరములు 
  3. పౌగండం - 10 సంవత్సరముల వరకు 
  4. కిశోరము - 15 సంవత్సరముల వరకు 
  5. తారుణ్యం - 25 సంవత్సరముల వరకు 
  6. యౌవనం - 45 సంవత్సరముల వరకు 
  7. వృద్దాప్యము - 70 సంవత్సరముల వరకు 
  8. వర్షీయాస్తము - 100 సంవత్సరముల వరకు 

10, సెప్టెంబర్ 2014, బుధవారం

అష్ట సిద్ధులు

భగవానుని దివ్య ఆరాధనకు ఫలముగా భక్తులకు ప్రాప్తించే ఈ ఎనిమిది సిద్దులను అష్ట సిద్దులు అంటారు.

అవి
1. అణిమ : సుక్ష్మావస్థ లో కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మి అతనిలో మనస్సును నిలుపుటవల్ల ఈ సిద్ధి వస్తుంది. దీని వల్ల అత్యంత సుక్ష్మఅణువుగా యోగి తనను తానూ మార్చుకొనగలడు.
2. మహిమ : భగవంతుని మహాత్తుని దర్శించగలిగిన సాధకునకు ఈ సిద్ధి వస్తుంది. దీని కారణంగా అతను శివ, కేశవులకు సామానమయిన కీర్తిని పొందగలుగుతాడు
3. గరిమ : ఈ సిద్ధి సాధించిన వారు తమ శరీర బరువును ఈ భూభారమునకు సమానముగా చేయగలరు.
4. లఘిమ : ఈ సిద్ధి గలవారు తమ శరీరమును దూది కంటే తేలికగా ఉంచగలరు
5. ప్రాప్తి : ఈ సిద్ధి ద్వారా  కావాలనుకున్నా క్షణములలో శూన్యం నుండికూడా సృజించుకోగలరు
6. ప్రాకామ్యము : అనేక దివ్య శక్తులు (దూర దర్శనము, దూర శ్రవణము , ఆకాశ గమనము) వారి వశములో ఉంటాయి.
7. ఈశత్వం : ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగిన అధికారం వస్తుంది
8. వశిత్వం : సకల జీవరాశులు వారు చెప్పినట్లుగా ప్రవర్తింప చేయగలిగిన శక్తి

ఐతే ఈ సిద్ధులు ప్రాప్తించిన వారు ఈ సిద్ధులను ప్రదర్శించుట నిషేదించ బడినది.

సప్త పర్వతములు

పురాణముల ప్రకారం అత్యంత ప్రసస్తమైన పర్వతములు ఏడు. ఆ సప్త పర్వతములు 
  1. సుమేరు 
  2. కైలాస 
  3. మలయ 
  4. హిమాలయ 
  5. వింధ్యాచల 
  6. అగస్త్యాచల 
  7. గంధమాదన 

సప్త ద్వీపములు

ఇదివరకు ఒక్కటిగా ఉన్న భూభాగమును 7 భాగములుగా విభజించారు. అవి సప్త ద్వీపములు
  1. జంబు 
  2. పాలాక్ష 
  3. శాల్మలి 
  4. కుశ 
  5. క్రౌంచ 
  6. శాఖ 
  7. పుష్కల 

ద్వాదశ సూర్యులు వారి నెలలు , అనుచరులు


మనకు ప్రతి నెలలో ఉండే సూర్యుడు ఒక్కో రకమైన తేజస్సుతో ఉంటాడు కనుక మంకు గల 12 నెలల్లోని 12 సూర్య తెజన్ను ను ఆధారంగా, వాని తీవ్రతల, ప్రభావాల ఆధారంగా వానిని 12మంది సూర్యులుగా భావించి వారి అనుచరులను కూడా విభాగం చేసారు. ఒక్కో సూర్యునికి ఒక రాక్షసుడు, ఒక గంధర్వుడు, ఒక అప్సరస, ఒక ముని మరియు ఒక నాగు లు అనుచరులుగా ఉంటారు.    
             
   
మాసము
సూర్యుడు
ముని
యక్షుడు
గంధర్వుడు
అప్సరస
రాక్షసుడు
నాగ
1
చైత్రం
దాత
పులస్య
రధక్రుత్
తుంబురుడు
కృతస్థలి
హేతి
వాసుకి
2
వైశాఖ
అర్యమ
పులః
అధోజ
నారదుడు
పుంజక స్థలి
ప్రహేతి
కఛనీర
3
జ్యేష్ట
మిత్ర
అత్రి
రధస్వన
హహ
మేనక
పౌరుషేయ
తక్షకుడు
4
ఆషాడ
వరుణ
వసిష్ఠ
చిత్రస్వన
హుహు
రంభ
సహజన్య
శుక్ర
5
శ్రావణ
ఇంద్ర
అంగీరస
శ్రోత
విశ్వవసు
ప్రమ్లోచ
వర్యుడు
ఏలాత పత్ర
6
భాద్రపద
వివస్వ
భృగు
ఆసారణ
ఉగ్రసేన
అనుమ్లోచ
వ్యాగ్ర
శంఖపాల
7
ఆశ్వయుజ
పూష
గౌతమ
సురుచి
సుసేన
ఘృతాచి
వాత
ధనుంజయ
8
కార్తిక
పర్జన్య
భరద్వాజ
రితు
విశ్వ
సేనజిత్
వర్కా
ఐరావత
9
మార్గశిర
అంషుమాన్
కశ్యపుడు
తర్క్స్య
రుతసేన
ఊర్వసి
విధ్యుత్ చత్రు
మహాసంఖ
10
పుష్యం
భగ
అయు:
ఊర్ణ
అరిష్టనేమి
పుర్వచిత్తి
స్పూర్జ
కర్కోటక
11
మాఘం
త్వష్ట
జమదగ్ని
సతాజిత్
ధృతరాష్ట్ర
తిలోత్తమ
బ్రాహ్మాపేత
కంబళా
12
ఫాల్గుణ
విష్ణు
విశ్వామిత్ర
సత్యజిత్
సుర్యావర్క
రంభ
మఖాపేత
అశ్వతర

మనకు గల 12 మంది సూర్యుల ఉహా చిత్రములు

1. దాత 

2. అర్యమ 


3. మిత్ర 

4. వరుణ 

5. ఇంద్ర 

6. వివస్వ 

7. పూష 

8. పర్జన్య 

9. అంషుమాన్ 

10. భగ 

11. త్వష్ట 


12 విష్ణు